Saturday, October 16, 2010

బి.ఎస్.ఎన్.ఎల్ సిబ్బంది దివాళా కోరుతనం

ప్రపంచాన్ని గతంలో అంగ భలం, తదుపరి ఆయుధ భలం నియంత్రించేవి. ఆతరువాత ప్రజాస్వామ్యం పుణ్యమా అని  అంగ,ఆయుధ భలాలు లేని నేతలు నియంత్రించేరు. కాని కొంత కాలానికి  వ్యాపారస్త్లులు  నియంత్రించే రోజు  లొచ్చాయి.  మీరు/మనం  ఏ  బ్రాండ్ క్యేండోమ్ వాడాలో కూడా వారే  నిర్ణయించే స్థితికి వచ్చేరు. కాని వ్యాపార రంగంలో పోటీ కారణంగా  ఈ రోజు ప్రపంచాన్ని,ప్రపంచ పోకడను  నియంత్రించే అవకాశం వినియోగదారునికి వచ్చింది. అవును నేడు వినియోగదారుడే దేవుడు.

ఈ సత్యాన్ని మన మహాత్ముడు ఏనాడో పసికట్టాడు భోధించాడు. కాని  వినియోగదారుడే సుప్రీం అన్న సత్యాన్ని మన బి.ఎస్.ఎన్.ఎల్ సిబ్బంది గ్రహించినట్టు లేరు. వయస్సు మీద పడుతుంటే క్రమశిక్షణ తనంతట తనే కుదురుతూంది. బాద్యతా రాహిత్యాన్ని చూస్తే ఒళ్ళు మండిపోతూంది. కేవలం బి.ఎస్.ఎన్.ఎల్ సిబ్బందియొక్క బాధ్యతా రాహిత్యం వలన  వారి బ్రాండ్ బ్యాండ్ కనెక్శన్ తీసుకుని నేను పడుతున్న భాధలు అంతా ఇంతా కాదు.

నా సోదంతా చెబుతానేమోనను పేజి క్లోస్ చెయ్యకండి. మిమ్మల్ని కడుపుబ్బా నవ్విస్తాను. నా కడుపు కాలితే నాలో హాస్య రసం ఉప్పొంగుతుంది. నేనెవర్నైతే తిడతానో వారే నవ్వేస్తారు. నా బాధ మీతో పంచుకోవాలనే ఈటపా.( భవిష్యత్తులో నా ఆస్తి అంతా ఎవరికనుకుంటారు.. ప్రతి భారత పౌరునికి సమాన  వాటా కల్పిస్తా - సంపాదిస్తేగా అని అనుమానించకండి.. ఇంకొంత కాలం ఇంకా ధర్మం న్యాయం మీద విశ్వాసంతో ప్రయత్నించి విఫలమైతే ఎలాగోలాగా డబ్బు సంపాదిస్తా. పంచుతా)


ఏదో ప్రభుత్వరంగ సంస్థ కదా భొంతకు తగ్గ మొంత అన్నట్టుగా  సరిపోతుందిగా అని బ్రాండ్ బ్యాండ్ ప్రిఫెర్ చేసినందుకు భాగానే అనుభవిస్తున్నా. భహుసా ఆ నిర్ణయం తీసుకున్న రోజున  అన్ని గ్రహాలు నాకు వ్యతిరేకంగా ఉన్నాయేమో?


నాకెందుకింత బాధ కలిగిందంటే మద్యలో అప్పుడప్పుడు తగిలిన లక్కి,లాటరి డిప్పుల మినహా 1991 నవంబరు నుండే రెక్కాడనిదే డొక్కాడని బతుకే నాది. కాని 2007లో తమిళంలో నెంబర్ వన్ దినపత్రికగా పేరొందిన దిన తంది పత్రికలో విలేకరిగా చేరి కాస్త ఊపిరి పీల్చుకున్నాను. ( నెల జీతం ఇచ్చారండోయి - ఆంద్రప్రభలోనైతే కంచి గరుఢసేవే) కోటలో దాన్యం నిల్వ ఉంటే విజయం  వైపు దూసుకుపోవడం కాస్త తేలికవుతుంది కదా. రెండు సం.ల్లో కాస్త నిలదక్కుకున్నాను.

దినతందిని వదలి వేసినా ఆర్థికంగా ఏ ఇబ్బంది లేక కాలం సాగిపోసాగింది.తమిళ బ్లాగ్ హిట్ కావడం. ఆన్ లైన్ జ్యోతిష సలహా ద్వారా డబ్బులు భాగానే రావడం చూసి కాస్త ధైర్యం చేసి బ్రాడ్ బ్యాండ్ కనెక్షనుకు తెగించాను. మా ఇంట ల్యేండ్ లైన్ లేనందున - దాంతో నాకు అవసరం లేక పోయినా ల్యేండ్ లైన్ కమ్ బ్రాడ్ బ్యాండుకు కలిపి రూ 2,225 రూపాయలు కట్టాను. ( ఈ డబ్బుతో భయిట ఇంటర్ నెట్ సెంటర్లోనైతే 222 గంటలు బ్రవుజింగ్ చేసుకుని ఉండవచ్చు. గ్రహాలు వక్రించి కంప్యూటర్ నుండి పొగే వచ్చినా " బాబూ ..ఇదేదో పొగేచ్చేట్టుంది చూడూ" అని లేచి వచ్చేసే వీలుండేది.

ఒక్క ల్యేండ్ ఫోన్ తెచ్చి మా కొంపలో  ఉంచటానికి వారం పట్టింది. ఆ ఆఫీసులో అన్ని ఫోన్లు ఎందుకు పెట్టుకున్నారో గాని ఒక్క సారీ ఫోన్ లిఫ్ట్ చెయ్యరూ. వారిదేం పోయే .. ఎవడు కనెక్షన్ తీసుకున్నా,ఉంచుకున్నా, వెనక్కిచ్చేసినా వారికి  ఊడేదేంటి.. నెల పుడితే జీతాలు.


యమగోల సినిమాలొ అల్లురామలింగయ్యా ఆంటాడుగా "తాళం వేసితిని గొళ్ళెం మరిచితిని" అని ఆ చందంగా ఫోనేమో పెట్టారు మహానుభావులు. అది మ్రోగాలిగా?  నేను మా పుత్రికా రత్నం ఆఫీసు చుట్టూ తిరిగాం.

 అది పని చెయ్యడానికి మరో రెండురోజులు పట్టింది. సొమ్ము చెల్లించి 12 రోజులు పూర్తైతే గాని మోడెమ్ ఇల్లు చేరలేదు. ఇంతకీ ఒక్కో ప్రక్రియకి ఉన్నతాధికారులతో చెప్పించవలసి వచ్చింది. చివరికి మోడెమ్ తో ఒక ఇంజినీరు వచ్చాడు. అతను నా కంప్యూటర్ ముందు కూర్చుంటే ఒట్టు. ఇంట్లోకి అడుగు పెట్టుంటే ఒట్టు. ( మా ఇంటి వాస్తు నచ్చలేదేమో?)  సెల్ ఫోన్ మాట్లాడుతూ లోపలికి భయిటకు పచార్లు చేస్తూ ఉండి పోయాడు.

నెట్ కనెక్శన్ కు కావల్సిన ల్యేన్ డ్రైవ్ ఉన్న సి.డి ఇవ్వలేదుసరికదా. ఏవో కబుర్లు చెప్పి  మా కంప్యూటర్లో అదేదో స్పేర్  పార్ట్ లేదని చెప్పి ఒక కాగితం మీద సంతకం తీసుకుని వెళ్ళి పోయారు. ఆ కాగితంలో అన్నీ ముట్టాయని, బ్రాడ్ బ్యేండ్ ఏం చక్కా పనిచేస్తుందని రాసుంది. సంతకం పెట్టనంటే ఉన్న ఫోనూ పని చెయ్యకుండా చేస్తారేమో? మళ్ళీ ఎన్ని సార్లు తిప్పిస్తారేమోనని జడచి సం. చేసాను.


 నా వయస్సు 43 నాకు ఒక కన్స్యూమరుగా కంప్యూటరుతో, ఇంటర్ నెట్ తో  పరిచయముంది గాని ఏ బి సి డి కూడా తెలీదు.  ఎలా చెప్పను నా భాధ.

నా తండ్రి పాపం నిజాయితీగా ( అదేనండి చేతగాని వాడిగా)  బతికి పోయిన జిల్లా ఖజాణా అధికారి. పైసా పైసాకు బడ్జెట్ వేసుకుని ఖర్చు పెట్టిన క్యెరక్టర్ అతనిది. మరి ఆ జీన్సే గా నాలోనూ ఉంటాయి. బ్రాడ్ బ్యాండుకంటూ సొమ్ము కట్టగానే " హమ్మయ్యా ఇక రోజువారి ఖర్చులో రూ.40 మిగిలిపోయింది" అని అనుకున్న నాకు సతరు ఇంజినీరు భాగానే ఇచ్చాడు పని.

ఏదో ఒక జ్యోతిష్కునిగా నాకున్న పరిచయాలతో మరో హార్డ్ వేర్ అతనిని పిలిపించి పని కానిచ్చాను. జస్ట్ మూడ్రోజులే. మూనాళ్ళ  ముచ్చట అని దీనినే అంటారేమో?   నాలుగో రోజు ( శనివారం) బ్రాడ్ బ్యాండ్ చేతులెత్తాసింది. ఇదేమిటయ్యా బాబూ అని ఫోన్ చేసి అడిగితే ( ఎక్కడ ఏ అగ్రహారం కాలి పోయిందేమో గాని ఫోన్ లిఫ్ట్ చేసేరు.  బోర్డు మారుస్తున్నారట వారంలోపు ఒక్కో ప్రాంతానికి పునరుద్దరిస్తారట.

ఇదేమన్నా 19 వ శతాభ్దమా లేక మూడో ప్రపంచ యుద్దమేమన్నా జరుగుతూందా? లేదు మా చిత్తూరు ఏమన్నా నక్సల్స్ ప్రభావిత  ప్రాంతంలో  ఉందా? పొరభాటున కాశ్మీరుతో కలిపేసారా? నాకైతే అర్థం కాలేదు. మీకేమన్నా అర్థమైతే చెప్పండి.

తమిళంలో ఒక సామెత ఉంది "కల్యాణమ్ కట్టియుమ్ బ్రహ్మచారి" అని. పెళ్ళి చేసుకున్నా భ్రహ్మచర్యం తప్పలేదన్నట్టుగా ఉంది నా పరిస్థితి.

మీలో ఇంకెవరూ బ్రాండ్ బ్యేండ్ ప్రిఫెర్ చెయ్య్ద్దొద్దండి బాబూ.. నా ఖర్మ నాతోనే పోనీ.. (కాని కొందరున్నారు వారు కట్టిన డబ్బు పోతే అదే ఫైనాన్స్ కంపెనీలో పది మందిని చేర్పించి సంతృప్తి చెందుతారు) పాపం ఈ శాఖ మంత్రి రాజాకు ఇవన్ని చక్కదిద్దటానికి ఎక్కడిది తీరిక. షిట్ ! 

ఈ నిర్వాకానికి బి.ఎస్.ఎన్.ఎల్ సిబ్బందికి ఇన్ని యూనియన్లు ,సమ్మెలు,డిమాండ్లు.. నా బోటి తలక మాసిన యెదవలు మరో పది మంది కనెక్షన్ తీసుకుంటేగా వీరిని మేపడం వీలవుతుంది. వీరి నిర్వాకం చూస్తే ఉన్న కనెక్షన్సూ ఊడి పోయేలా ఉంది.

1 comment: