Sunday, October 17, 2010

బాపలు పరచే పరుపులో

ఎందుకూ కొరగాని సాధనతో, హృదయమంతట వేధనతో
విడిచి పెట్టలేని సత్య శోధనతో
తిలకిస్తున్నా వీరి ఆగడాలను
నువ్వు ఉలిక్కి పడతావని
వీరు హుష్ కాకీ అవుతారని.
చందమామ పాఠక బాలుని వలే
ఎదురు చూస్తున్నా

ఇక్కడివి ఏవీ నాకు నచ్చడం లేదు
నా మనస్సు మెచ్చడం లేదు

వీరికి ముచ్చమటలు పుట్టించే  మార్గం తెలిసిన వాడ్ని
నా కలం కదిలితే దాని వెంట త్రిశూలం కదులుతుందని తెలుసు
కాని కాని...
జరిగిపోతూందే కిరాతక ఖూనీ

నీ గురించిన ఊహల్లోనే బతికి ఈ అపోహలతోనే
అకాలంగా అంతమై పోతాననుకోకు

నేను మిన్నంటే  లక్ష్యంతో పాటు
ఎలుకకన్నా హేయంగా బతుకుతున్న
ఈ అనామక జీవితాన్ని సైతం
అంగీకరించాను
అందలానిలకైనా ఇందులకైనా సిద్దమే
ఈ అక్షరాలు మూగవాని కలలా
ఈ చెవిటి ప్రపంచానికి
చేరకుండానే పోయినా డోంట్ కేర్!

నా ఈ  ఆవేశానికి  అక్షర రూపం ఇవ్వగలగడమే
చెబుతూంది. నీ దైవ శక్తికన్నా నా ఆత్మ శక్తి గొప్పదని
తేల్చుకోవలసింది నువ్వే

అర్థం, పర్థం లేని వ్యర్ధ  వేదాల పుటల్లో,
రారాజుల కోటల్లో
నాలుగు గోడల ఇరుకులో
బాపలు పరచే పరుపులో
విని విని విసుగెత్తిన పొగడ్తల నిషాతో
నీ భక్త జనుల సొల్లు వేడుకోళ్ళ తమాషాతో
భంధీగా ఉండి పోతావో? .. లెక

నా మదిన చెలరేగే కలకలం దాటికి ,
నా కలం కదలికల పోటుకి
రాసుకుంటే రవ్వ రాలు  నా మాటల ఏటుకి
బండ బారిన  నీ గుండె 
మళ్ళీ కొట్టుకోవడం ప్రారంభించాకనన్నా
చేత త్రిశూలం పట్టి ,నా దేశాన్ని అభివృద్ది భాటలో నెట్టి
అవినీతి చేతులను కట్టి
నీ ఉనికిని చాటుకుంటావో?

తేల్చుకోవలసింది నువ్వే !

అమ్మా!
నిద్రించేవారిని చంపడం ధర్మం కాదే వీరు నిద్రిస్తున్నారే.
నా ఈ అక్షరాల్లోకి నా అత్మ శక్తి
విద్యుత్సక్తిలా ప్రవేశించినా నా అక్షరాలు సైతం
జాగృత పరచలేనంత ప్రగాఢ నిద్రలో ఉన్నారే

కాసింత గడువిస్తే నా ప్రయత్నం ఏదో చెయ్యనిస్తే
ఆపై చెయ్యవే ప్రళయ కాల ఘోర నృత్యం

ఆపై మోగనీయవే మరణమృదంగం

No comments:

Post a Comment