Monday, December 20, 2010

తల్లి నీకే తల్లినైనవాడను

నువ్వే రూపాన వచ్చినా  గుర్తించే స్థితిలో ఉన్నానన్న భ్రమ నాకుంది
నాడు నెను అపర  బ్ర్హహ్మనన్న అపార విశ్వాసంతో
విర్ర వీగుతుంటే
విశ్వనాథునివలే నా అదనపు శిరస్సును ఖండించావు

అలా ఖండించక మునుపే నువ్వు దర్శనమిచ్చి ఉన్నా
ఏ నటీ మణో మేకప్పుతో రోడ్డున పడిందనుకునే వాడ్నేమో?

ఆనాడు ఐదు తలల్లో  పది కళ్ళున్నా నిన్ను గుర్తించక సజావుగా బతికెయ్య కలిగాను
నేడైతే ఉన్న ఒక్క తల తిరిగి పోతుంది.
ఉన్న రెండు కళ్ళు కన్నీళ్ళల్లో కరిగి పోతున్నాయి.

ఈ నా కన్నీళ్ళు నీ పాదాలను కడగడానికో కొత్తగా నీ కరుణను పొందటానికో కాదు
ఇన్నాళ్ళు నాకోసం నువ్వున్నావని, నీ కరుణతోనే నన్ను మననిస్తున్నావని గుర్తించలేక పోయినందుకే.

నేను అహంకారిని నాకోసమే కాదు నీ కోసము సైతం కన్నీళ్ళు పెట్టను
కోట్ల మంది నా పై కత్తులు దూస్తే హాయిగా నవ్వుకోగలను .వారు నన్ను ,నా ఉనికిని గుర్తించారని మురిసి పోగలను.

కాని ..కాని.. ఒక్క నీ  కరుణను మాత్రం భరించలేక పోతున్నానే కన్నీటిని కట్టిడి చేసుకోలేక పోతున్నానే.

నాటి మలుపుల్లోని పరమార్థం..
నిన్నా మొన్నటి మలుపుల్లోని గూడార్థం అన్ని తెలిసాక

వాటి వెనుక ఉన్న నీ అమ్మ మనసు అర్థమయ్యాక  నా కాళ్ళు వెల వెల పోతున్నాయి.
అన్నీ అర్థమయ్యాక - నా అహాన్ని సంతృప్తి పరచగల నా ప్రయత్నాలన్ని వ్యర్థమయ్యాక
నా శరీరమే నాతో అహాయ నిరాకరణ చేస్తుంటే మహా అహంకారినైన నేను
ఎలా తట్టుకోనే? దానిని నీ పాదాల చెంతకు ఎలా నెట్టుకురానే?

అమ్మా!
నీ ఛాయ నాటి ఆ మాయను ఆనాడే మాయం చేసి ఉంటే ఈ కాయం, ఈ గాయం ఇంతగా భాధ పెట్టేది కాదేమో?

నీ భీజం , నీ నామం , ఈ అక్షర హోమం యింకాస్త ముందుగా అంది ఉంటే  నా అహం పిచ్చి మొక్కగా ఉన్నప్పుడే తుంచి పారేసేవాడ్నేమో?

నా గ్రహం - దాని ఆగ్రహం - నీ అనుగ్రహం ఇంకాస్త ముందుగా తెలిసి ఉంటే ఈ ఆపరేషన్ ,ఈ పరేషాన్లకు అవసరం లేక పోయేదేమో?

అయితేనేం? పురిటి నెప్పులు ఎంత ఎక్కువగా భరించి ఉంటే అంతగా తల్లి బిడ్డల నడుమ అనుభంధం గట్టి పడుతుందని తెలుసుకోలేని మూర్ఖుడను కాను కదా..

ఇక్కడ నా హృదయ గర్బంలో నీ భీజాన్ని మోసి నాకే నాకై నిన్ను  కన్న వాడ్ని నేను. తల్లి నీకే తల్లినైనవాడను నేను

ఓం శక్తి

No comments:

Post a Comment