Wednesday, October 6, 2010

రాజకీయ పక్షాలు ఇప్పటికన్నా కళ్ళు తెరవండి

రాజకీయ పక్షాలంటే నా ఉద్దేశం గ్రామ స్థాయి కార్యకర్తనుండి పధాన మంత్రి అభ్యర్దుల దాకా అందరిని ఉద్దేశించి ఈ టపా వాస్తున్నాను . వీరు ఇకనన్నా మేలుకోవాలని లేకుంటే బ్యోరోక్రెట్ వ్యవస్థ, వ్యాయ వ్యవస్థ, పోలీసు వ్యవస్థ, మిలిటరి సైతం రాజ కీయ వ్యవస్థను హై జాక్ చేసి మిమ్మల్ని ఓవర్ టేక్ చేసే అవకాశం ఉందని నొక్కి చెప్పడమే నా ఉద్దేశం.



అదేంటి రా.పక్షాలు నిద్రపోవడమేంది? అని మీరు విసుక్కోవచ్చు. అవును వీరందరూ ఎదో భ్రమలో ఉన్నారు. కార్య రూపం దాల్చని కామవాంచలే అధికార దాహానికి, డబ్బు వ్యామోహానికి, హింసకు ప్రేరేపిస్తాయి.



కామవాంచ మస్తిష్కపు పొరల్లో దాగి ఉండగా మానవునికి తానేంచేస్తున్నాడో? ఎందుకు చేస్తున్నాడో అతనికే తెలీని స్థితి ఉంటుంది. తనకు కావల్సింది సెక్సేనని, అది లభించక పోవడం చేతే తను డబ్బు అధికారాలు,హింస వెంట పరుగులు తీస్తున్నాడని అతనికే తెలీదీ.



పోనీ డబ్బు,అధికారం చేతికొచ్చినాకన్నా అతను శాంతిస్తాడా అంటే అదీ కుదరదు. డబ్బు,అధికారం చేతికొచ్చేసరికి అతను గతంలో అనక త్రొక్కిన కామవాంచ మేల్కొని అతనిని ప్రేరేపిస్తుంది.



ఇవన్నీ అతనికి తెలియదు. ఇంత ఏల తమ తప్పిదాలవలన రాజకీయ వ్యవస్థే హైజాక్ కానుందని,తమల్ని ఓవర్ టేక్ చేసి తమలను అన్ పాపులర్ చెయ్యగల శక్తులు డేగ కన్ను వేసాయని కూడ వారికి తెలీదు. మనో గ్రథులతో సతమతమయ్యే రా.నాయకులకు , వారి అనుచర గణాలకు తెలియని విషయాలు మరి కొన్ని ఉన్నాయి.



మన ఎన్నికల ప్రక్రియలో ఉన్న లోపం వలనే ప్రజామోధం లేని వారు సైతం పాలకులవుతున్నారు. ముక్కోణపు పోటి జరిగింది. ప్రజారాజ్యం పార్టిని వద్దనుకున్నవారే కాంగ్రెస్ మరియు తె.దేపాకు ఓటేసేరు. కాంగ్రెస్ పార్టిని వద్దనుకున్నవారే ప్రజా రాజ్యం మరియు తె.దే.పా కు ఓటేసేరు. తె.దేపా పార్టిని వద్దనుకున్న వారే కాంగ్రెస్ మరియు ప్రజా రాజ్యం పార్టీలకు ఓటేసేరు. ( ఓటెయ్యని వారు ఈ మూడు పార్టీలను వద్దనుకున్నవారే.



అంటే కాంగ్రెస్ పార్టికి ఓటిచ్చినవారికంటే వద్దనుకున్న వారు మూడింతలు ఎక్కువన్న మాట ( తె.దే.పా,ప్రజారాజ్యం పార్టీలకు ఓటిచ్చినవారు , అసలు ఓటే వెయ్యని వారు - వీరు కాంగ్రెస్ పార్టిని కోరుకొని ఉంటే ఓటేసేవారు కదా)



ఇలా ప్రతి పార్టిని కావాలనుకున్న వారికంటే వద్దనుకున్న వారు మూడింతల మంది ఉన్నారు. ఇదెలా అసలైన ప్రజాస్వామ్యం అవుతుందో, కాంగ్రెస్ పార్టి ఎలా ప్రజా స్వామ్యబద్దంగా ఎన్నుకోబడిందనొచ్చో మీరే ఆలోచించండి.



ఇది పార్టీల లోపమే కాదు మన వ్యవస్థలోని లోపం. పోలైన ఓట్లల్లో ఒక్కో పార్టికి లభించిన ఓట్ల రేషోలో అసెంబ్లి లోని ఎమ్.ఎల్.ఏ సీట్లు కేటాయిస్తే అది హేతు బద్దంగా ఉంటుంది కాని కేవలం ఒక్క శాతం మంది అదనంగా కోరుకున్నంత మాత్రాన కాంగ్రెస్ యొక్క గత పాలన ప్రజలను మెప్పించిందని ఎలా చెప్ప గలం?



ప్రస్తుతమున్న పద్దతిలో ఎన్నికై ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన వారు మనలను కోరుకున్న వారికంటే చీదరించిన వారు మూడింతలున్నారని గ్రహించాలి. ఈ సత్యాన్ని వై.ఎస్. గుర్తించారు కాబట్టే ప్రభుత్వ డెలివరి మెకానిజంలో లోపముంది ముందుగా దానిని సవరించాలని " రచ్చ బండ" కార్యక్రమానికి పూనుకున్నారు. కాని కాలం కలిసి రాక ఆయన దుర్మరణం పాలయ్యారు.



కేవలం ఎన్నికల వ్యవస్థలోని లోపం కారణంగా అధికారాన్ని చే జిక్కించుకున్న కాంగ్రెస్ పార్టి కనీసం సాంకేతికంగా ( హేతు బద్దంగా కాదు) ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధుల అభిప్రాయం మెరకన్నా నిర్ణయాలు తీసుకుంటుందా అంటే అదీ లేదు.



రోశయ్య, మన్మోహన్ సింగ్ వంటి వారు ప్రజలతో ఏమాత్రం మమేకం కాని వారు.ప్రజల మెప్పు పొందని వారు.పొంద జాలని వారు. వారిని దేశం పై రాష్ఠ్ర్రం పై రుద్దడం అప్రజాస్వామికం. మనలను కాదనుకున్నవారు మూడింతల మంది ఉన్నారన్న సత్యాన్ని పాలకులు గ్రహించాలి. దానికి తగ్గట్టుగా ప్రజల కనీశ అవసరాలను తీర్చే దిశగా పని చేసి వారి మెప్పుపొందే ప్రయత్నం చెయ్యాలి.



కాని ప్రజలేమో తమకు పట్టం కట్టారని ప్రతిపక్షాలను తిరస్కరించారని విర్ర వీగుతున్నారు. (ప్రతి పక్షాల కథ కూడ ఇంతే వీరిని కూడ మూడింతల మంది తిరస్కరించినట్టే గా) సత్యాన్ని గ్రహించనంటున్నారు. ఇది ప్రజా స్వామ్యం ప్రజలే ప్రభువులు. పాలకుల ఎంపిక ప్రజాభిప్రాయానికి అనుగుణంగానే జరగాలి. కాని ప్రస్తుతం అమల్లో ఉన్న విదానం కారణంగా మూడింతల మందిచే తిరస్కరింప బడిన వారే పరిపాలిస్తున్నారు.



అందుకే నేను ఎప్పటినుండో ప్రత్యక్ష ఎన్నికలు జరగాలని నొక్కి చెబుతున్నాను. అలా ఎన్నుకోబడిన వాడు ప్రజా ఖంటకుడుగా ఉండి ఈ దేశాన్ని సర్వ నాశనం చేసినా ఫర్వా లేదు.కానీశం ప్రజా స్వామ్య బద్దంగా ఎన్నుకోబడ్దాడు.ప్రజలు తప్పుడు వ్యక్తిని ఎన్నుకున్నారు. అందుకు ప్రతిఫలం అనుభవిస్తున్నారని అనుకోవచ్చు. కాని ప్రజలు కనీశం కల కనని వ్యక్తులకు అధికారం కట్ట పెట్టడం ప్రజలను ముఖ్యంగా ఓటర్లను అవమానించటమే అవుతుంది.



రోశయ్యన్నా ప్రత్యక్ష రాజకీయాలతో కొద్దో గొప్పో సంబంధమున్న వ్యక్తి. కాని మన్మోహన్ కేవలం రిజర్వ్ బ్యాంకు ఉధ్యోగి. బ్యూరాక్రెట్. గోదాముల్లో వానకు తడిచి,ఎండకు ఎండి,పందికొక్కులకు ఆహారం అవుతున్న ఆహార దాన్యాలను పేదలకు ఉచితంగా పంచి పెట్టాలని కోర్టు ఆదేశిస్తే కుదరదని వ్యవసాయ శాఖా మంత్రి, కోర్టు సిద్దాంత పరమైన విషయాల్లో జోక్యం చేసుకోరాదని ప్రధాని మన్మోహన్ చెప్పేరు.



ఎంతటి కార్కోటకుడైనా సరే ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండి పదవిలోకి వచ్చిన వాడైతే అతని నోట ఈ మాట వచ్చేది కాదేమో?



దారిద్రియ రేఖకు దిగువ బ్రతుకుతున్న వారి సంఖ్యను తేల్చడానికి రక రకాలైన సర్వేస్లు నిర్వహించేరు. దారిద్రియ రేఖకు దిగువ అంటే ఆకలి కోరల్లో అని అర్థం. ఆయా పూట తిండికో,తరువాతి పూట తిండికో గ్యారంటి లేనివారని అర్థం.



ఒక్కో సర్వే ఒక్కో సంఖ్యను సూచించింది. ఎటుతిరిగి రమా రమి యాబై శాతం ప్రజానీకం దారిద్రియ రేఖకు దిగువ బ్రతుకుతుంటారు. స్వాతంత్ర్యం వచ్చి 63 సం.లు అవుతున్నా ఇటువంటి దుస్థితి కొనసాగటం సిగ్గు చేటు. ఆకలి మనిషిని చంపెయ్యదు. కాని అతనిలో ప్రగాఢ నిద్రలో ఉన్న మృగాన్ని తట్టి లేపుతుంది. దేశం మీద , ప్రభుత్వాల మీద , సమాజం మీద సాటి మనుష్యుల మీద నమ్మకం సన్నగిల్లేలా చేస్తుంది. ఆకలి దోపిడిలు బొమ్మ బొరుసు వంటివి. ఆకలికి కారణం దోపిడి. దోపిడి కారణంగా ఆకలి మరింత పెరుగుతుంది. ఆకలి దోపిడికి దారి తీస్తుంది.ఈ విష వలయంలో చిక్కుకున్నవారు భయిట పడటం చాలా కష్ఠం.



ఇట్టి విషవలయంలో చిక్కుకున్నవారు దేశం గురించి, దేశాభివృద్ది గురించి,రాజకీయాల గురించి ,సంస్కరణల గురించి ఆలోచించే వ్యవధి కలిగి ఉంటారని నేననుకోను. మరి ఎవరు ఈ దిశగా ప్రయత్నం మొదలు పెట్టాలి?



మద్య తరగతి వారా? వీరు డబుల్ రోల్ ప్లే చేస్తుంటారు. తమదాకా రాని విషయాల్లో న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించి కఠిన శిక్షలు సిఫార్సు చేసే వీరు తమ దాకా వచ్చేసరికి రాజీ పడి పోతారు. దీనిని సైతం సహించే నేను వీరిలోని మరో సుగుణాన్ని మాత్రం అసల్ జీర్ణించుకోలేక పోతాను.



అదేమంటే అసలు విషయాలు తెలిసో తెలీకో బ్యోరో క్రెట్లకు వంతె పాడటం. నాటి టి.ఎన్.శేషన్ మద్య తరగతి వారి హీరోగా చలామణి అయ్యేరు. కాని నాకైతే బ్యూరోక్రెట్లంటేనే శరీరం మీద జెర్రి ప్రాకినట్టుంటుంది. ఎమెర్జెన్సి పీరియడ్లో ఒక శేషన్ పుట్టుకు రాడు. ఎప్పుడైతే ప్రజాస్వామ్యంలో రాజకీయ శక్తులు ప్రజలకు దూరమై బలహీన పడతాయో అప్పుడు బ్యూరోక్రెట్లు పురి విప్పుతారు.



నా దృష్థిలో న్యాయ మూర్తులు సైతం బ్యూరోక్రెట్లే. వారి విజ్నత పట్ల నాకు పెద్దగా నమ్మకం లేదు. న్యాయవస్థ కూడ ఈ ప్రపంచంలో ఒక భాగమే. భాహ్య ప్రపంచంలో ఉన్న కుళ్ళు కుతంత్రం, రాజకీయాలు,కులాల కురుక్షేత్రం అన్నీ అక్కడా ఉంటాయి. ఆకాశం నుండి ఊడి పడ్డవారెవరూ అక్కడ లేరు. మరి వారొచ్చి ఉచిత సలహాలిచ్చి పేరు కొట్టేసేంతగా రాజకీయ పక్షాలు నిర్వీర్యమయ్యాయంటే ఏం చెప్పాలి.



ఎంతకు దిగ జారినా రాజకీయ నాయకులు ఏదో రోజున ప్రజల వద్దకు వచ్చి చేయి చాచి ఓట్లు అభ్యర్దించ వలసిన వారు కాబట్టి వారి పైనే నా నమ్మకం , ఆశంతా. రాజకీయ నాయకులను ప్రజలు ఎన్నుకుంటారు. ఆ ఎంపిక కరెక్టో కాదో అది మళ్ళా కథ. కనీశం వారు ప్రజలచే ఎన్నుకోబడ్డారు.ప్రజల మద్యనుండి వచ్చేరు.

కాని ఈ బ్యోరోక్రెట్ల కథేమి?



కేవలం అధికారాన్ని అనుభవించి పదవీ విరమణ పొందాక పైరవీలు చేసుకుని బతికేవారినైనా క్షమించ వచ్చు. కాని వారికి అన్నీ సవ్యంగా జరిగినంత కాలం వారి కంటికి కనబడని అవినీతి వారు రాజకీయ ఉద్దేశంతో రాజీనామా చేసిన మర్సటి దినమే ఎలా కనబడుతుందో నాకైతే అర్థం కాదు.



ఉ. జయప్రకాష్ నారాయణ్ ఉన్నారు. ఈయన గారు పదవిలో ఉండంగా ఆయన గారి శాఖల్లో ఎటువంటి అవతవకలు,అవినీతి జరగనే లేదా? వీరు జిత్తుల మారి నక్కలు. వీరికన్నా గూండా గిరి చేసే రాజకీయ నాయకులే మిన్నా.



ఎక్కడో ప్రరంభించి ఎక్కడికో వెళ్ళి పోయా..( ఏం చేద్దాం వయస్సు మీద పడుతుంటే ఇదో జబ్బు) రాజకీయ నాయకులు వ్యవస్థను ఎంతగా బ్రష్ఠు పట్తించాలో పట్టించేసేరు.వీరి పుణ్యమా అంటూ ప్రజలు చచ్చి పోతున్నారు. హత్యలు,ఆత్మ హత్యలు, రోడ్డు ప్రమాదాలు,అగ్ని ప్రమాదాలు, ఆకలి చావులు.



ఇదే రేంజిలో పోతే కనీశం వీరు దోచుకోవడానికి సైతం ప్రజలుండరు. రాజ్యం ఏలాలన్నా ప్రజలు కావాలిగా? ఇప్పటికన్నా అందరు రాజకీయ పక్షాలు ఒకే వేదిక పైకొచ్చి సమీక్షించుకోవాలి.



దేనిని రాజకీయం చెయ్యాలి. మరి దేనిని రాజకీయం చేయకూడదు అని ఒక అవగాహణకు వచ్చి ఒప్పందాలు చేసుకోవాలి. లేకుంటే ఈ రోజు వీరి కారు తలుపులు తీయడానికి పోటి పడే బ్యూరోక్రెట్లే రేపు మేకై కూర్చుంటారు. ఒక సుప్రీమ్ కోర్టు ప్రథాన న్యాయ మూర్తి ఒక ప్రణాళిక ప్రకారం వ్యవహరిస్తే తాను రిటైర్డ్ కావడానికి ఆరు నెలలముందు ప్రజలకు సినిమా చూపి మరి రాజ్యాధికారాన్ని చేజిక్కించుకునే అవకాశం ఉంది. మిలిటరి,పోలీస్ ఇలా ఎన్నో వ్యవస్థలు రాజకీయ వ్యవస్థను ద్వంసం చేసేసే పరిస్థితిని ఇప్పటికే సృష్ఠించేసిన రా.నాయకులు ఇప్పటికైనా మేలుకోవాలి.



పౌరుల ప్రాణ రక్షణ, వైద్యం, ఆహార భద్రత,విద్యా,ఉద్యోగావకాశాలు ఇలా కేవలం కొన్ని అంశాల్లోనన్నా ఒక కామన్ అజెండా రూపొందించుకోవాలి. ఏ పక్షమైనా ఈ ఇష్యూస్ పై రాజకీయం చెయ్యరాదు. ఎవరికి అధికారం ప్రాప్తించినా ఒకే అజెండాను అమలు చెయ్యాలని నిర్ణయించుకోవాలి.



మానవావళిని సర్వ నాశనం చెయ్యగల ఆణువిద్యుత్ ప్లాంట్లు, కాలుష్యం, సహజ వనరుల ద్వంసం ఇలా కొన్ని అంశాలను ఎంపిక చేసి ఒక పటిష్ఠమైన అజెండాను రూపొందించుకోవాలి.



ఎన్నికల ఖర్చులు:

రాజకీయంలో అవినీతికి నాంది ఎన్నికల ఖర్చులు. ఒక ఎమ్.ఎల్.ఏ అభ్యర్ది గెలవాలంటే కనీశం రెండు మూడు కోట్లు వెచ్చించవలసి ఉంది. ఎం.పిల విషయంలో ఇది నాలుగు రెట్లు పెరుగుతుంది. ఈ సొమ్మును సమ కూర్చుకోవడం కోసం ఎన్నో ప్రజాఖంఠక చర్యలను చూసి చూడనట్టు పోవలసి ఉంది. వీరి పదవులతో తమ పబ్బం కడుక్కొన్న కార్పోరేట్ సంస్థలు తదుపరి ఎన్నికల సమయంలో ఫండ్స్ ఇస్తాయిగాని విజయాన్ని ఇవ్వలేవుగా?



ఎవరు అధికారంలోకి వస్తే వారి చుట్టూ ప్రదిక్షణలు మొదలు పెడతారు. ఓడిన వారు మూలన పడతారు. పైగా కేసులు,విచారణలు. అందుకే పార్టి ఫండ్స్ సేఖరణలో కూడ అఖిల పక్షం ఒక అవగాహణకు రావాలి.

ఉమ్మడిగా వాదించి స్వయం నియంత్రణతో మసులుకోవాలి. ఉ. మాఫియా, లిక్కర్ మాఫియా,మందుల కంపెనీలు.



తాము తీసుకున్న నిర్ణయాలను జనభాహుళ్యానికి తెలిపి దీంతో వారికి కలిగే లాభమేమిటో వివరించే ప్రజల్లోనుండి విరాళాలు పొందే ప్రయత్నం చెయ్యాలి



అంతర్గత ప్రజా స్వామ్యం:

పార్టీల్లో అంతర్గత ప్రజా స్వామ్యం లేమితో అనర్హులకు సీట్ల కేటాయింపు వారు విచ్చలవిడిగా ఖర్చులు పెట్టి రాజకీయాలను ధనమయం చెయ్యడం జరుగుతుంది. కాబట్టి ప్రతి పార్టి అంతర్గత ప్రజాస్వామ్యాన్ని పెంపొందించుకోవాలి. పార్టీల అంతర్గత ఎన్నికలను సైతం ఎన్నికల కమీషనే నిర్వహించేలా వత్తిడి తేవొచ్చు. ఇలా యుద్ద ప్రాతిపదికన,ఉమ్మడి నిర్ణయాలు తీసుకోకుంటే వారి పని మెటాషే..



ప్రజలు నిజంగానే భాగా విసిగి పోయారు. వీరి విసుగుని ఏ న్యాయమూర్తో,ఏ బ్యూరాక్రెట్టో,ఏ పోలీసు అధికారియో,ఏ మిలిటరి జెనరలో వాడేసుకోవడానికి ముందే రా.నాయకులు మేలుకోవాలి. లేకుంటే అసలికి మోసం రామ హరే అంటూ చక్క భజనలు చేసుకోవలసిందే.



ఇటీవల మందిర్, మస్జిద్ తీర్పు నేపథ్యంలో రా.పార్టీలు నడుచుకున్న విదానం హర్షదాయికం. ఈ పంథాలో ఇంకొన్ని అడుగులు ముందుకేసినా రాజకీయ వ్యవస్థ బతికి భయిటపడుతుంది.లేదా భారత దేశంలోని ప్రజా స్వామ్యానికి పెను సవాళ్ళు తప్పవు.

No comments:

Post a Comment