నామం అంటే పేరు. నామి అంటే సదరు పేరుగల వ్యక్తి. సాధారణంగా ఇవి రెండు వేర్వేరని భావిస్తాం. కాని ఈ రెండింటికి నడుమ ఏమాత్రం తేడా లేదని ఈ రెండు సమానమైనవని ఆథ్యాత్మికం చెబుతుంది. అదెలా సాధ్యమని మీరు ప్రశ్నించవచ్చు.
చిన్నపిల్లలకు తీపి పదార్థాలంటే ఎంతో ప్రీతి. మరీ చాక్లెట్స్ అంటే ప్రాణం. మీ నోట నుండి చాక్లెట్ అన్న పదం రాలగానే వారి నోట చాక్లెట్ పడిపోయినంతగా ఉత్సాహంతో ఉరకలేస్తారు. వాటి నోట లాలజలం స్రవిస్తుంది.ఇక్కడ చాక్లెట్ చెయ్యాల్సిన పనిని చాక్లెట్ అన్న పదం చేసింది.
మీరు ఏదో ఆలోచనలతో సతమతవుతూ బజారులో నడుచుకుంటూ పోతున్నారు. అప్పుడు ఎవరో మీ పేరు పెట్టి అరుస్తారు. అప్పుడేం జరుగుతుంది.అందాక మీలో అల్లుకు పోయిన ఆలోచనా వలయాలు ఒక్క సారిగా తెగి పోతాయి. ఎవరో పలికిన మీ పేరు మీ శరీరంలోని అణువు అణువులో, కణ కణాల్లో ప్రకంపణలు సృష్ఠిస్తుంది.
కేవలం ఒక తిను బండారం యొక్క పేరు ఆ చిన్న పిల్లను, , కేవలం సామాన్యులైన మీ పేరు మిమ్మల్ని ఇంతగా కదిలించాయి అంటే పరమ పావనుడైన ,సాక్షాత్ భగవత్ స్వరూపుడైన బాబా నామాలు మనలను ఎంతగా కదిలించ కలుగుతాయో మీరే అంచనా వేసుకొండి.
బాబా భక్తులకు బాబా గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. ఆయన స్థూల శరీరంతో ఉండగానే ఎన్నో అద్భుతాలు చేసిన సంగతి మీకు తెలిసిందే ! మరి ఆత్మ స్వరూపుడై, సర్వాంతర్యామిగా ఉన్న ఈ కాలంలో బాబా నామాన్ని జపించడం ఎంతటి ప్రభావాన్ని చూపుతుందో చెప్పక్కర్లేదు.
"యధ్బావం తద్భవతి" - మీ భావం ఎలా ఉంటే మీరు అలానే మారుతారు". రష్యాను పాలించిన లెనిన్ చిన్నపిల్లవానిగా ఉన్నప్పుడు ఒక సంఘఠణ జరిగింది. అర్ద రాత్రి లెనిన్ పడక గదినుండి ఏవో మాటలు వినిపించాయి. వెంటనే అతని తల్లి గదికొచ్చి చూసింది. లెనిన్ తన రెండు చేతులు ముందుకు చాపి తన ముందు లక్షల కొలది జనులున్నట్టుగా " ఓ నా ప్రియ ప్రజానీకమా" అని సంభోధిస్తూ పూస గుచ్చినట్టుగా ఉపన్యసిస్తున్నాడు. ఇది చూసిన తల్లి బిత్తర పోయింది. పిల్లవానికి పిచ్చెక్కిందేమోనని కూడ శంఖించింది. కాని కాలం భవిష్యత్ కార్యాచరణ కోసం లెనిన్ చేసిన రిహర్సల్ అదని రుజువు చేసింది.
అత్యల్పులమైన మనం పునీతుడైన బాబా నామాలను నిత్యం జపిస్తుంటే మన భావం చక్క పడొచ్చు. బాబా అంతటి పవితృలము కాక పోయినా మనలోని మలినాలన్ని కొట్తుకు పోతాయి. ఈ సహస్ర నామావళిని అను నిత్యం త్రికరణ శుద్దితో పఠిస్తూ వస్తే వారి వారి ఏకాగ్రతను పట్టి బాబా ప్రత్యక్షంగానో, కల లోనో దర్శనమివ్వడం ఖాయం. అరిషఠ్వర్గాలు హరించుకు పోయి ప్రాపంచికంగాను , ఆథ్యాత్మికంగాను మీరు ఉన్నత శిఖరాలకు ఎదగడం ఖాయం.
No comments:
Post a Comment