Thursday, November 18, 2010

మా ఎం.ఎల్.ఏ నన్ను పట్టుకొస్తా అన్నాడు..

నా పేరుకు ముందు చిత్తూరు ఉంది కాబట్టి చిత్తూరు నియోజక వర్గం ఎం.ఎల్.ఏ అయ్యుంటాడని , మరీ సి.కె. బాబు అయ్యుంటారని  అనుకునేరు.. అదేమో తెలీదు కాని మా నియోజక వర్గంలో నాలుగు విడతలు ఎం.ఎల్.ఏ గా ఉన్నందునో ఏమో గాని ఎం.ఎల్.ఏ అంటేనే సి.కె గుర్తుకొస్తారు. కాని నేనంటున్న ఎం.ఎల్.ఏ ఏ.ఎస్ మనోహర్. సదా శాంతి మంత్రం జపించే తె.దే.పా ఎం.ఎల్.ఏ ఇలా అని ఉంటారా అని అనుమానిస్తే పొరభాటే. నేను చెప్పనున్న విషయం అక్షర సత్యం.

ఇంతకీ రెఫరెన్స్ టు ది కాంటెక్స్ట్ ఇవ్వాలిగా..

అది ఎన్నికల సం. 2004. బాబు గారి  ...క్రింద క్లైమోర్ బాంబు పేలగానే ప్రజల మీద వల్లమాలిన అభిమానం పుట్టి  కోటి వరాలు ప్రకటించేరు. 1991లో ఆదర్శ వివాహం చేసుకున్న నాకు 2004 దాక రేషన్ కార్డు లేదు . వందల సార్లు అప్లై చేసి ఉంటా.ఫలితమే శూన్యం.

సర్లే ఎన్నికల సం. లో జాక్పాట్ కొడతామని రంగంలో దిగాను.  ఆపరేషన్ ఇండియా 2000 పై చంద్ర బాబు గారి నిర్లక్ష్యాన్ని ఎండ కడుతుండేవాడ్ని. (ప్రకటనల ద్వారా) ఇది చూసి జిల్లా అధికారులు  over action తో నన్ను  వెలివేసినంతగా ట్రీట్ చేసేవారు. ( బహుశా సి.ఎం కార్యాలయం నుండి ఏదన్నా మౌలిక అదేశాలు జారి అయ్యాయో ఏమో తెలీదు)

రేషన్ కార్డు కోసం ఎం.ఆర్.ఓ గారిని స్వయంగా కలుసుకుని వినతి పత్రం ఇచ్చాను. ఆయన గారి స్పందన మరీ చప్పగా ఉండడంతో కలెక్టరేట్ వెళ్ళి జె.సి గారిని కలిసాను (రాజేంద్ర ప్రసాద్ అనుకుంటా) ఆయన నంగి నంగిగా సేటైర్ చేసాడు.

"ఇదేందయ్యా దేశాన్ని సంపన్న దేశం చేస్తానంటావు ? రేషన్ కార్డుతో నీకేం మిగులుతుంది నెలకు పదో పదిహేనో రూపాయలు రాయితీ వస్తుంది అంతేగా"

నేనన్నాను " హలో రేషన్ కార్డు అన్నది కుక్కకు లైసెన్స్ వంటి గుర్తింపు కార్డు. నేను విశ్వాసమున్న కుక్కను. నాకు లైసెన్స్ కావాలి - సంపాదన ద్యేయం అనుకుంటే కలెక్టరేటును ప్లాట్లు వేసి అమ్మేస్తా"

ఆయన " ఏందీ ఎలా అమ్మేస్తావు? ఎవరు కొంటారు" అని అడిగాడు.

నేనన్నా " ఏముంది సార్ .. ఎవరో సుల్తాన్ మా నాయనమ్మకు నాయనమ్మను ఉంచుకుని ఈ భూమి ఆవిడ పేర వ్రాసాడు అని ఒక డాకుమెంట్ క్రియేట్ చేస్తా. ప్లాట్లకు చెరో పది వేలు ఫిక్స్ చేస్తా.జనాలు  వస్తే లక్ష పోతే పది వేలని కట్టేస్తారు సార్"

జె.సి బిత్తర పోయి ( ఈ తి.ము.కొ తో ఎందుకురా నాయనా అనుకున్నాడేమో?) నా వి.పత్రం మీద ఏదో వ్రాసి ఎం.ఆర్.ఓకిమ్మన్నాడు.

నేను ఎం.ఆర్.ఓ చేతికివ్వక కొరియర్ ద్వారా పంపాను. కవరింగ్ లెటరులో "నాకు పెళ్ళై నేను రే.కార్డుకు అప్లై చేసి 13సం.లయ్యాయి. ఇప్పటికైనా రే.కార్డు మంజూరు చెయ్యండి లేకుంటే మీ ఖర్మ అని వ్రాసాను. ఆయనగార్కి ఎక్కడో కాలినట్టుంది.

ఈ కౌన్సిలర్లు పైరవీలకోసం ఆఫీసు చుట్టు తిరుగుతుంటారుగా. వారితో వాకబు చేసి "స్వయంగా కలవ"మని కబురు చేసాడు. వెళ్ళాను.

ఇష్ఠమొచ్చినట్టు అరిచాడు. "ఏందయ్యా ఖర్మ.. ఖర్మంటే ఏం నీ ఉద్దేశం ?" " నీకివ్వనంటే  ఇవ్వను .. ఏం చేస్తావో చేసుకో అన్నాడు"

నేను ఎన్.టి.ఆర్ స్టైల్లో సద్వినయంగా నమస్కరించి వచ్చేసాను. జిల్లా జడ్జికి ఈ ఉదంతాన్ని వ్రాసాను.

ఈ లోపు అనుకోని మలుపుగా ఎం.ఆర్.ఓ గారికి ఎవరో మా నాన్న గారి గురించి ,నా గురించి చెప్పినట్టుంది ( నాన్న బతకలేని  ట్రజరి ఆఫీసర్ నేను బతకలేని బేకార్ ఆఫీసర్) . మళ్ళి పిలిపించి పాపం 24 గంటల్లో నాకు రేషన్ కార్డు ఇప్పించాడు.

ఇది ఇక్కడికి ముగిసి పోయుంటే ఎం.ఎల్.ఏకి నన్నెత్తుకొస్తా అని చెప్పే పరిస్థితి వచ్చుండేది కాదు.

జిల్లా జడ్జికి వ్రాసిన లేఖపై ఆయనగారు స్పందించి కలెక్టరుగారికి రెఫర్ చేసి లేఖ పంపినట్టుంది.అది  కలెక్టరుగారివద్దనుండి ఎం.ఆర్ .ఓ కార్యాలయానికి వచ్చినట్టుంది. మనోళ్ళు (రెవిన్యూ వాళ్ళు) తమ బాణీలో దాన్ని తమ .... క్రింద ఉంచుకునేసినట్టుంది.

ఇవంతా జరిగి నెలలు గడిచి పోయాక.. ఏదో టీ పార్టిలో జిల్లా జడ్జికి ఎం.ఆర్ .ఓ గారు తగిలినట్టుంది. అంతే ..పేపరోళ్ళ బాషలో చెబితే ఒంటి కాలి పై లేచాడు. విరుచుకుపడ్డాడు .

ఎం.ఆర్.ఓ తన గోడు ఎం.ఎల్.ఏ మనోహర్ గారికి చెప్పుకుంటే ఆయనగారు అప్పట్లో నేను పి.ఆర్.ఓగా ఉన్న ఎలక్ట్ర్రికల్ యూనియన్ వారికి ఫోన్ చేసి "మర్యాదగా ఆడ్ని (నన్ను) నన్నొచ్చి కలవమనండి ..లేకుండే వెహికిల్ పంపించి ఎత్తుకొస్తా " అన్నాడు(ట).

యూనియన్ వారు (వారికి మనం లేకుంటే ఏమీ తోచదు) నా చేతికి ఐదొందలిచ్చి "స్వామీ ! రెండ్రోజులు నువ్వెక్కడన్నా ఉండు మేం మాటాడి సర్దేస్తామనేరు" నేను అలాగేనని చెప్పి సూటిగా ఎం.ఎల్.ఏ ఇంటికి వెళ్ళాను.

(మన చాయ, ముఖం, నుదట గందం,తిలకం, విబూది, మన  హవభావాలు,బాడి ల్యేంగువేజ్ , మాటల్లోని ద్వని, శృతి అన్నింటికి మించి నిజాయితి ముందు ఎలాంటి వాడన్నా కన్విన్స్ కావలసిందే)

ఎం.ఎల్.ఏ గారికి నాటి చిరంజీవి భాణిలో ఒక నమస్కారం పెట్టాను.సగం చల్ల బడ్డాడు. "ఏంటయ్యా.. ఏంటయ్యా.. ఎం.ఆర్.ఓ చాలా మంచోడయ్యా.. నీకేమన్నా ఇబ్బంది ఉంటే నాకు చెప్పాల్సింది.. ఇదేం పని "అంటూ ఇంకేదో చెప్ప బోతే..

నెనన్నాను " సార్.. ఇప్పుడు ప్రేలింది గత ఏడాది దీపావళి తాలూకు అవుట్ సార్"

ఆయన ఫక్కున నవ్వి "ఏం జరిగిందయ్యా.." అన్నాడు . నెను జరిగిన  కథంతా అందమైన చందమామ కథలా  చెప్పాను.

"సర్లే.. పోయి ఎం.ఆర్.ఓ గారికి ఇవే మాటలు చెప్పు.పాపం చాలా ఫీలయిపోయాడు "
అన్నాడు.

నేనదే పని చేసాను. ప్రాబ్లం సాల్వ్ అయ్యింది. మీకూ ఒక మంచి టపా దొరికింది.

No comments:

Post a Comment