Thursday, June 10, 2010

ప్రజా సమస్యల పై ఉరిమిన చిత్తూరు టైగర్

ప్రజా నాయకులు సి.కె. ప్రజా పథం, మన్రుల , అధికారుల పని తీరు పై గళం విప్పారు. సి.కె.మాట్లాతున్నంత సేపు జెడ్.పి మీటిగ్ హాల్ స్థబ్దంగా ఉంది పూర్తి వివరాలను ఆంద్రజ్యోథి ఇల అందించింది . ఆంద్ర జ్యోథికి కృతజ్ఞతలతో.
ఆంద్ర జ్యోతిలో ప్రత్యక్షంగా చదవ కోరువారు ఇక్కడ నొక్కండి




ప్రజాపధానికి జనాన్ని బలవంతంగా తరలించారు

చిత్తూరు, జూన్ 9 : 'జిల్లాలో 26 రోజుల పాటు జరిగిన ప్రజాపథం కార్యక్రమానికి బలవంతంగా తరలిస్తేనే జనం వెళ్ళారు. ప్రజలు అందజేసిన అర్జీలలో 50 శాతం సమస్యలు కూడా పరిష్కారం కాలేదు. సమస్యల పరిష్కారం విషయంలో అధికారులు చెబుతున్న లెక్కలు నమ్మదగినవిగా లేవు. సక్రమంగా పని చేయని అధికారులు మొక్కుబడిగా విధులకు వస్తున్నారు. వారి పట్ల ప్రజల్లో అసంతృప్తి వుంది. పనుల కోసం మంత్రులు కూడా అధికారులను అడుక్కోవాల్సివస్తోంది.

ఇది వినడానికే ఎంతో బాధగా వుంది. మంత్రులు సొంత నియోజకవర్గాలకే పరిమితం కాకుండా జిల్లా మొత్తానికీ బాధ్యత వహించాలి.....' అంటూ అధికార పార్టీకే చెందిన చిత్తూరు శాసనసభ్యుడు సి.కె.బాబు అధికారులు, మంత్రులపై మాటల తూటాలు పేల్చారు. బుధవారం చిత్తూరులోని జడ్పీ మీటింగ్ హాలులో ప్రజాపథంలో అందిన సమస్యల పరిష్కారానికి సంబంధించి ప్రజాప్రతినిధులతో డివిజన్‌స్థాయి సమీక్షా సమావేశం జరిగింది.

మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గల్లా అరుణకుమారి, జడ్పీ చైర్మన్ సుబ్రహ్మణ్యంరెడ్డి, ఎమ్మెల్సీ గోపీనాధ్, కలెక్టర్ వి.శేషాద్రి తదితరులు పాల్గొన్న ఈ సమావేశంలో తొలుత మంత్రి గల్లా అరుణకుమారి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె తన నియోజకవర్గంలో ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలకు డాక్టర్లు సక్రమంగా రావడం లేదని, ఆరోగ్యశ్రీ పథకంలో మందుల కోసం రోగులనుంచి స్విమ్స్‌లో డాక్టర్లు లంచాలు అడుగుతున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు.

ఈ విషయాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు. ప్రసంగం ముగించాక అరుణకుమారితో పాటు మంత్రి పెద్దిరెడ్డి కూడా స్థానిక ఎమ్మెల్యే సి.కె.బాబును మాట్లాడాల్సిందిగా కోరారు. ఆయన మాట్లాడేందుకు తొలుత నిరాకరించినా మంత్రులిద్దరూ పట్టుబట్టడంతో తప్పనిసరై ప్రసంగించేందుకు ఉద్యుక్తులయ్యారు. అధికారులు, మంత్రులు ఇరుకునపడే విధంగా వ్యాఖ్యానాలు చేశారు.

అధికారులు సక్రమంగా పనులు చేయడం లేదని, మంత్రులు తమ సొంత నియోజకవర్గాలకే పరిమితం కాకుండా జిల్లా మొత్తం మీద ప్రజల సమస్యల పరిష్కారానికి బాధ్యత వహించాలన్నారు. సి.కె.బాబు ప్రసంగించిన తీరు, అందులో ప్రస్తావించిన అంశాలతో సమావేశంలో ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడింది. దీంతో మంత్రి అరుణ హడావిడిగా మళ్ళీ మైక్ అందుకుని తాను చెప్పింది వేరే అని, ఎమ్మెల్యే దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని వివరణ ఇచ్చారు. దీనికి సి.కె.బాబు సమాధానమిస్తూ తాను అధికారులను, మంత్రులనూ కించపరిచే ఉద్దేశంతో మాట్లాడలేదన్నారు.

అనంతరం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో అధికారులు బాగా పనిచేస్తున్నారని, ముఖ్యమంత్రి సైతం ఈ విషయంలో అభినందించారని కితాబునిచ్చి ప్రసంగాన్ని పూర్తి చేసి అంతటితో సమావేశాన్ని ముగించారు. ఎమ్మెల్యే సి.కె.బాబు ప్రసంగం సృష్టించిన వేడి కారణంగా సమావేశంలో పాల్గొన్న జడ్పీ చైర్మన్ సుబ్రహ్మణ్యంరెడ్డి, ఎమ్మెల్సీ ఆర్.గోపీనాధ్‌లకు మాట్లాడే అవకాశం కూడా లేకపోయింది.

No comments:

Post a Comment